1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:32 IST)

ఓర్వకల్లులో అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ సమీపంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు సుమారు పది వేల ఎకరాలలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో  దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్/ పారిశ్రామిక నోడ్ ను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం నాడు ఓర్వకల్ / కర్నూలు ఎయిర్ పోర్ట్ వద్ద పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
 
ఆదివారం కర్నూలు ఎయిర్ పోర్ట్ లో తొలి ప్యాసింజర్ ఫ్లైట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అవతరణ కంటే ముందు 1953-56 లో మొట్టమొదటిసారిగా కర్నూలులో విమానాశ్రయం అవసరమని అప్పటి స్థానిక ప్రభుత్వం ఢిల్లీకి చేసిన విన్నపం 60 సంవత్సరాల తర్వాత నేడు ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు/ ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ లో ప్యాసింజర్ విమాన రాకపోకలు  కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి ప్రారంభం అయ్యాయని అన్నారు.

విమాన రాకపోకలు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెనకబడిన ప్రాంతం రాయలసీమ, ఆ రాయలసీమలో కూడా అత్యంత వెనకబడిన ప్రాంతం కర్నూలు జిల్లా ప్రజల 60 ఏళ్ల విమానయాన కలను నిజం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు

వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఓర్వకల్ ఎయిర్పోర్టు సమీపంలో అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు కోసం ఇప్పటికే దాదాపు ఏడు వేల ఎకరాలను  సేకరించడం జరిగిందని,  ఇంకా రెండు వేల ఎకరాలను సేకరించడం జరగబోతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో.. పట్టుదలతో కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఉన్నత కోర్టుల అనుమతి పొందిన తర్వాత రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు
 
1972 సంవత్సరంలో  అప్పటి ముఖ్యమంత్రి.. ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు చాలా గొప్ప ఆశయంతో కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ను స్థాపించడం జరిగిందని,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సర్వీస్ కు బాగా చదువు కోవడం.. ప్రిపరేషన్ కోసం ఆ కాలేజ్ స్థాపించడం జరిగిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 సంవత్సరం సిల్వర్ జూబ్లి ఇయర్ కాబట్టి సిల్వర్ జూబ్లీ కాలేజ్ పేరు పెట్టడం జరిగింది అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూల్ నగరంలోని జగన్నాథ గట్టు వద్ద సిల్వర్ జూబ్లీ కాలేజ్ కోసం బ్రహ్మాండమైన కొత్త క్యాంపస్,  క్లస్టర్ యూనివర్సిటీ కట్టడానికి సుమారు రూ.88 కోట్లను మంజూరు చేస్తూ  జిఓ ను విడుదల చేయడం జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు
 
నేషనల్ హైవే కర్నూలు నుంచి చిత్తూరు, కర్నూలు నుంచి బెంగళూరు, నంద్యాల నుంచి జమ్మలమడుగు కు ఒకే కనెక్షన్ నేషనల్ హైవేస్ ను ఈ మధ్యనే డిక్లేర్ చేయడం జరిగిందన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు కేవలం వర్షపునీటి పైనే ఆధారపడి ఉండేదని.. హంద్రీ నీవా సుజల స్రవంతి నుండి గాజులదిన్నె ప్రాజెక్టు కు మూడున్నర టీఎంసి ల నీటిని ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతో కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు పట్టణానికి, డోన్ పట్టణానికి, కర్నూలు నగరానికి త్రాగు నీటిని అందించడం జరుగుతుందన్నారు.
 
పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.