1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (11:44 IST)

ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం... మహా పాదయాత్రకు కాసుల‌ వర్షం!

అమరావతి రైతుల మహా పాద యాత్రకు పూల వర్షంతో పల్లె జనులు స్వాగతం పలుకుతున్నారు. యాత్ర 11 రోజులు పూర్తి చేసుకుంటోంది. పది రోజుల‌కు యాత్ర ప్రకాశం జిల్లాలో సాగింది. ఉదయం 9 గంటలకు దుద్దుకూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాచపూడి, కల్లగుంట మీదుగా సాయంత్రం నాగులుప్పలపాడు చేరుకుంది. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని రైతులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు మద్దతుగా తరలిరాగా, 4 కి.మీ మేర జన జాతరను తలపించింది.
 
 
మరోవైపు మఫ్టీలో ఉన్న పోలీసులు ఫొటోలు తీస్తూ, డ్రోన్‌తో వీడియో చిత్రీకరిస్తూ కనిపించారు. అమరావతికి మద్దతు తెలుపుతూ ప్రజలు తమ వెంట తెచ్చుకున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘నాటి స్వాతంత్య్ర సమరయోధుల అసలైన వారసులు నేటి అమరావతి రైతులు’, ‘వృథా పోదు తల్లి మీ కష్టం, ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం’, ‘మూడు రాజధానులు వద్దు...ఒకే రాజధాని ముద్దు’ వంటి బ్యానర్లు కనిపించాయి. ఖమ్మంకు చెందిన ప్రకాశరావు దంపతులు ఆలోచింపజేసే బ్యానర్‌తో యాత్రలో పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని రాచపూడి వద్ద స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు స్వాగతం పలికారు.
 
 
సంఘీభావం తెలపడానికి వస్తున్న మహిళలు మహా పాదయాత్రకు గుమ్మడి కాయలతో దిష్టి తీశారు.   ఒక్కరోజే దాదాపు 700 కాయలు వినియోగించారు. దుద్దుకూరు నుంచి రాచపూడి వరకు 4 కి.మీ మేర పూల మార్గం ఏర్పాటు చేశారు. పర్చూరు, అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, రవికుమార్‌, శ్రీబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ముత్తముల అశోక్‌రెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌, డేవిడ్‌రాజు, ఐకాస నేత కొటికలపూడి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుడు జ్యోతుల నెహ్రూ తదితరులు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్నారు.


మరోవైపు ఒక్క రోజే యాత్రకు రూ.60 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. అద్దంకి నియోజకవర్గ ప్రజలు రూ.36 లక్షలు, ఎమ్మెల్యే రవికుమార్‌ బృందం రూ.10 లక్షలు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ.10 లక్షలు విరాళమిచ్చారు.