మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశం... సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం
మావోయిస్టు పార్టీ కీలక నేత, భారీ దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీస్ గఢ్ సరిహద్దు నుంచి అతడు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం హిడ్మా తెలంగాణలోకి అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. అయితే, ఇటీవల చోటుచేసుకున్న అగ్ర నేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకూ మాడ్వి హిడ్మా వచ్చి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని రెండు, మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలోని ఆస్పత్రులను జల్లెడపడుతున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.