చిరు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు : ఎండి.జానీ పాషా
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (రి.నెం:138/2020)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం అంతా కరోనా మహమ్మారి వలన విలవిల లాడుతూ ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న సందర్భంలో, గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరిన నాటి నుండి కరోనా విజృంభిస్తున్న సమయంలో సైతం నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కోవిడ్ వాక్సిన్ అందించే కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు నిమగ్నమైవున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే నూతన వ్యవస్థలో రక రకాల పనులతో తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటూ ప్రజలకు వ్యాక్సిన్ అందించే క్రమంలో, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం ఆ ఎన్నికల్లో సైతం సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తూ ఎన్నికల విధులు నిర్వహించవలసి వుంది.
ఈ సమయంలో ఉద్యోగులు కరోనా బారిన మరియు ఇటీవల శరవేగంగా విజృంభిస్తున్న స్ట్రైన్ వైరస్ బారిన కానీ పడే అవకాశం పుష్కలంగా వుంది. ఒకవేళ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. అయినా ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం చిరు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమేమని, అసలే ప్రొబేషన్ పీరియడ్‌లో వున్న తమకు జరగరాని సంఘటనలు జరిగితే తమ కుటుంబాలు అన్యాయమవుతాయని ఈ సందర్బంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.