శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 జులై 2023 (14:04 IST)

నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

suicide
నెల్లూరులో వైద్య విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య (23)గా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పలాసకు చెందిన చైతన్య(23) అనే వైద్య విద్యార్థిని నెల్లూరు నగర పరిధిలోని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ హౌస్‌ సర్జన్‌ చేస్తోంది.
 
ఆమెకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ రోజు ఉదయం కళాశాల హాస్టల్‌ గదిలో చైతన్య బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 
20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 
 
దేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం వెల్లడించారు. 23 రోజుల పాటు సాగే సమావేశాల్లో 17 పనిదినాలు ఉంటాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. సమావేశాలు సజావుగా జరగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పార్లమెంట్ పాత భవనంలో సమావేశాలు మొదలవుతాయని, మధ్యలో కొత్త భవనంలోకి మారతాయని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉందనీ, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రణరంగాన్ని తలపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మణిపూర్ అల్లర్లపై చర్చకు పట్టుపట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. 
 
మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరుపుతుండటం, అమలుకు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడుతుందన్న ప్రచారమూ సాగుతోంది. అయితే, ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.