శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (11:52 IST)

రాజధానిలో మంత్రి రహస్య పర్యటన…??

ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు తలలో నాలుకలాగా వ్యవహరించేవారు.

ఆయనకు సౌమ్యుడు, సమర్ధుడుగా పేరుంది. పైరవీ కారులను, రాజకీయ బ్రోకర్లను ఆయన ఆమడ దూరంలో పెడతారట. పేరుకే మంత్రి కానీ ఆయన ఒక అధికారి వలె నిర్ణయాలు తీసుకుంటారట. ఫైళ్ల పరిష్కారంలో కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరట. ఆయన ఇటీవలె ఎవరికీ తెలియకుండా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో ఒంటరిగా పర్యటించారట.
 
ఎక్కడెక్కడ ఏయే కట్టడాలు ఎంత వరకు పూర్తి అయ్యాయి….. మిగతా పనులు పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుంది… ఇప్పటి వరకు కట్టిన కట్టడాలకు కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించారా..లేదా..? చెల్లిస్తే ఎంత మొత్తం చెల్లించారు.. ఇంకెంత చెల్లించాల్సి ఉటుంది అని ఆరా తీశారట.

రాజధాని ప్రాంతంలో ఎలాంటి భవనాల నిర్మాణం జరగలేదు అని కొందరు మంత్రులు చేసిన విమర్శలు, ఆరోపణలు, కల్పితాలేనని, అవన్నీ రాజకీయ విమర్శలేనని, ఇంతవరకు అభివృద్ది బాగానే జరిగిందని మంత్రి తెలుసుకున్నారట. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఆయన అమరావతి పరిసర ప్రాంతాలలో పర్యటించి ఉంటారని అధికార వర్గాల అభిప్రాయం.
 
ఆయన ప్రభావం పనిచేసిందేమో ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్దిపై దృష్టి సారించినట్టు అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆర్దికమంత్రి కూడా రాజధాని విషయంపై ముఖ్యమంత్రి జగన్‌కు వాస్తవాలు తెలియజేయటంతో ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటారని అధికారులు నమ్ముతున్నారు.

రాజధానిపౖెె మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలు, ఆరోపణలలో నిజం లేదని, తన పరిదికి మించి బొత్స మాట్లాడారని జగన్‌కు అధికారులు, ఆర్దిమంత్రి చెప్పినట్లు తెలిసింది.. దీంతో ఆగ్రహం చెందిన జగన్‌ రాజధాని విషయంలో మంత్రులు ఎవరూ పెదవి విప్పద్దని ఆదేశించినట్టు తెలిసింది. ఈ సంఘటనలపై స్పందించేందుకు అధికారులలో కొందరు ముందుకు రావటం లేదు.