గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 21 డిశెంబరు 2021 (21:46 IST)

ఏం జనం ఏం జనం, రోజమ్మా మామూలుగా లేదుగా

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు వైసిపి నేతలు. అయితే ఒక్కో నియోజకవర్గంలో కొత్తగా చేసుకోవాలనుకున్నారు. కానీ అందరి కన్నా వెరైటీగా నగరి ఎమ్మెల్యే రోజా తన సొంత నియోజకవర్గంలో సిఎం జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. 

 
సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఉన్నా సరే పట్టించుకోకుండా రోజా ఉదయం నుంచి కూడా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఉదయాన్నే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
గ్రామగ్రామాన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. సిఎం ఫోటోలను చేతపట్టుకుని ర్యాలీని నిర్వహించారు. నగర వీధులలో ర్యాలీ కొనసాగింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఒక చోటకి చేర్చి భారీ కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వయంగా తినిపించారు రోజా.

 
అలాగే నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాల్లో మునిగితేలారు రోజా. రోజా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో ఎక్కడ చూసినా జనమే జనం. 

 
కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా, మాస్కులను ధరించకుండా వేడుకలను నిర్వహించారు. కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నా జనం పట్టించుకోలేదు. తన సొంత నియోజకవర్గంలోని ప్రజలను పుట్టినరోజు వేడుకలకు రోజా తీసుకురావడంతో ప్రత్యర్థి వర్గమే ఆశ్చర్యపోతోంది.