శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (15:09 IST)

ఏపీ పోలీసులపై కేంద్రహోం శాఖకు ఫిర్యాదు చేస్తా...

ఏపీ పోలీసులపై  ఎంపీ సీఎం రమేష్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతోంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఏం చెబితే అదే గుడ్డిగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. 

 
విజయవాడలో జరిగిన ఆందోళనలో సీఎం రమేష్, కన్నా లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ, ఏపీలో పోలీస్‌ వ్యవస్థ బాగోలేదని మొదట్నుంచీ చెబుతున్నానని అన్నారు. ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై కేంద్రహోం శాఖకు ఫిర్యాదు చేస్తాన‌ని సీఎం ర‌మేష్ చెప్పారు.


జ‌రిగిన పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని, ఘటనను సీరియస్‌గా తీసుకుందని అన్నారు. పోలీస్ వ్యవస్థ బాగుంటేనే శాంతి భద్రతలు బాగుంటాయన్నారు. రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సీఎం రమేష్‌ ఆరోపించారు.