ఆంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చేశారు...
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంతా అరాచకంగా మారిందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియా తో ఎంపీ సుజనా చౌదరి మాట్లాడారు.
ఏపీ హోం మంత్రి ప్రకటన భాధ్యతా రాహిత్యంగా ఉందని, కేంద్రమంత్రి మురళీధరన్ కడప జైలులో ఉన్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించడాన్ని హోంమంత్రి సుచరిత వ్యతిరేకించడం మంత్రి అవివేకానికి నిదర్శనమన్నారు. అనుమతి లేకుండా మసీదు నిర్మాణం జరుగుతుంటే, పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అక్కడకు వెళితే, పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారి విషయంలో హోం మంత్రి ఏమీ మాట్లాడకుండా, వైద్యుడైన బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై మంత్రి హోదా మరిచి అవాకులు చవాకులు పేలడం తగదన్నారు.
విచిత్రమేమెంటే బుడ్డా శ్రీ కాంత్ ను ఆత్మకూరు సంఘటనలో పోలీసులే రక్షించారని హోంమంత్రి ప్రకటించారని, అయితే, ఆయనను 307 సెక్షన్ కింద ఏవిధంగా అరెస్టు చేశారో హోంమంత్రి స్పష్టం చేయాలన్నారు.
ఆత్మకూరు సంఘటన దేశ భక్తలకు.. దేశ ద్రోహులకు మద్య జరిగిన సంఘర్షణ అని తేల్చారు. ఇక గుడివాడ వెళుతున్న బిజెపి నేతలను ఎందుకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్భందించారో హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు.
సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ , మీడియా ఇంఛార్జి లక్ష్మీ పతిరాజా తదితరులు మాట్లాడారు.