మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉండాలి : నాగ సాధువులు
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం సుభిక్షంగా ఉండాలని నాగ సాధువులు ఆకాంక్షించారు. గడచిన మూడు దశాబ్ధాలుగా హిమాలయాల్లో ఘోర తపస్సు గావించిన నాగ సాధువులు దేశం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో వర్ధిల్లాలని దేశవ్యాప్త పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ హస్తరేఖ నిపుణులు మండ్ర నారాయణ రమణారావు (కేసీఆర్ వ్యక్తిగత పూర్వ సిద్ధాంతి) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్న నాగ సాధువులు ఉండవల్లిలోని కరకట్ట వెంబడి ఉన్న ఆశ్రమానికి విచ్చేశారు. అక్కడ వారికి భక్తులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాగ సాధువులను విజయవాడ, అమరావతిలోని పలువురు ప్రముఖులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అభ్యర్థన మేరకు నాగ సాధువులు అమరావతిలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే మాజీ ఎంపీ గోకరాజు గంరాజు ఇంటికి కూడా వెళ్లి వారి కుటుంబసభ్యులకు ఆశీర్వచనాలు అందజేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చెంపేట తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుటుంబసమేతంగా ఆశ్రమానికి విచ్చేసి నాగ సాధువులను దర్శించుకుని వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. అక్కడ పలువురు భక్తులు ధ్యానం, పూజాధికాలు నిర్వహించి నాగ సాధువులను తులసిమాలతో సత్కరించి, పండ్లు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రముఖ హస్తరేఖ నిపుణులు మండ్ర నారాయణ రమణారావు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని, జీడీపీ రేటు వృద్ధిలోకి రావాలని, రెండు తెలుగు రాష్ట్రాలు పాడిపంటలతో సస్యశ్యామలం కావాలని, ప్రజలు ఆయురారోగ్యాలు ఉండాలని, అన్ని రంగాల్లోనూ ఆయా రాష్ట్రాలు పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ నాగసాధువులు ధ్యానం, యోగ సాధన ద్వారా భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం విజయవాడ ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా గుడికి నాగ సాధువులు విచ్చేస్తారని వెల్లడించారు. ప్రముఖ దేవాలయాల ఉన్నతాధికారులు కూడా నాగ సాధువులను దర్శించుకుని వారి ఆశీర్వచనాలు అందుకున్నారు.