శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (11:12 IST)

నేరం రుజువైతే మారుతిరావుకు ఉరిశిక్షే

మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడి హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న యువతి తండ్రి మారుతిరావుకు నేరం రుజువైన పక్షంలో ఉరిశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడి హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న యువతి తండ్రి మారుతిరావుకు నేరం రుజువైన పక్షంలో ఉరిశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు గతంలో పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వారు గుర్తుచేస్తున్నారు.
 
'మా అభిప్రాయంలో కారణమేదైనా పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలి. ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందే' అంటూ సుప్రీంకోర్టు గతంలో తేల్చి చెప్పింది. ఢిల్లీకి చెందిన భగవాన్‌దాస్‌ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకొని పరువు తీసిందన్న కోపంతో ఆమెను హతమార్చాడు. ఆ కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
'తమ కొడుకు/కూతురు ప్రవర్తన వల్ల పరువు పోయిందని చాలా మంది భావిస్తుంటారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె/అతడు ఇతర కులస్థులను పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాలు పెట్టుకోవడాన్ని అవమానంగా పరిగణిస్తారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చంపేయడం, భౌతిక దాడులకు పాల్పడడం చేస్తుంటారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. తమ కుమార్తె లేదా ఇతర వ్యక్తి ప్రవర్తన వల్ల అసంతృప్తిగా ఉంటే అతను/ఆమెతో సామాజిక సంబంధాలను తెంచేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. హింసాత్మక చర్యలకు పాల్పడకూడదు' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా, ఢిల్లీలో షియా వర్గానికి చెందిన యువతి సున్నీ వర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. దీంతో యువతి సోదరులు.. ఆ యువకుడి తమ్ముడ్ని హత్య చేశారు. 2008లో జరిగిన ఈ హత్య కేసును విచారించిన ఢిల్లీ కోర్టు దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. యువతి కుటుంబ సభ్యులు ఐదుగురికీ 2011లో ఉరిశిక్ష విధించింది. ఈ కేసులన్నింటినీ పరిశీలిస్తే మారుతిరావుపై నేరం రుజువైన పక్షంలో ఖచ్చితంగా ఆయనకు కూడా ఉరిశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.