మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (08:03 IST)

బాబు నివాసంపై దాడి కేసు : వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు

Nandigam
గత వైకాపా ప్రభుత్వంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఉండగా, ఈ కార్యాలయంపై గత వైకాపా ప్రభుత్వంలో దాడి జరిగింది. ఈ కేసులో నందిగం సురేష్‌పై కేసు నమోదైంది. 
 
అయితే, ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే, అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు.
 
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయనను అరెస్టు చేసి మంగళగిరి తరలిస్తున్నట్లు సమాచారం. అయితే, నందిగం సురేష్ అరెస్టును పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. 
 
మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతర నేతలంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో ప్రధాన నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లతో పాటు మరికొందరు నేతలు ఉన్నారు. వీరి ఆచూకీని తెలుసుకునేందుకు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం.