శనివారం ఢిల్లీకి చంద్రబాబు నాయుడు...అమిత్ షాతో భేటీ!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నారు. శనివారం ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు.
నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. తమపై దాడులు చేసేందుకు పోలీసులు, ప్రభుత్వం కలిసి పన్నాగం చేశాయని ఆయన ఆరోపించారు. అంతే కాదు... ఆర్టికల్ 365 ని ఏపీలో ఎందుకు అమలు చేయకూడదు అని కూడా ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అంటే, ఏపీలో శాంతి భద్రతలు లోపించాయని, జగన్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలను చేసినట్లు కనిపిస్తోంది. ఇపుడు ఢిల్లీకి వెళుతున్నా బాబు ఇదే అంశంపై హోం మంత్రి అమిత్ షా తో చర్చించే అవకాశం ఉంది.
ఇక టీడీపీ కార్యాలయంపై దాడిని పలువురు జాతీయ నేతలు ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీలో టిడిపి ఆఫీసుపై దాడిని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అలాగే, వైస్సార్సీపీ కార్యకర్తల గూండాయిజాన్ని తాను ఖండిస్తున్నానని, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విమర్శలను తట్టుకునే మనస్థైర్యం నాయకుడికి ప్రజా జీవితంలో ఉండాలని, విమర్శకు దాడులు జవాబు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో గొంతుకలు అణచివేయలేరని దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు.