శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (18:05 IST)

మంత్రి శ్రావణ్‌ కుమార్‌కు నారా లోకేష్, ఇతర మంత్రుల అభినందనలు

అమరావతి: ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్‌ను పలువురు మంత్రులు అభినందించారు. శుక్రవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు చినరాజప్ప, నారా లోకేష్, భూమా అఖిల ప్రియ, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ మరియు వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు. 
 
కొత్తగా బాద్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ శ్రావణ్‌ను కలిసి మాట్లాడుతూ చైనా పర్యటన ముందు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వర్గీయ కిడారి సర్వేశ్వరరావుగారితో నియోజకవర్గం అభివృద్ది పనులపై మాట్లాడుతూ కలిసి భోజనం చేశానని గుర్తుచేసుకున్నారు. శాఖాపరంగా, నియోజకవర్గ అభివృద్ధికి సహకారం కావాలని శ్రావణ్ కుమార్ కోరగా మంత్రులందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుటుంబ సభ్యుల బాగోగులు గురించి మంత్రి లోకేష్ శ్రావణ్‌ను అడిగి తెలుసుకున్నారు. 
 
అరకు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించాలని శ్రావణ్ కుమార్ లోకేష్‌ను కోరగా డీపీఆర్‌లు సిద్ధం చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిమ్మకూరును యూజీడి క్రింద రాష్ట్రంలోని ఒక మోడల్‌గా అభివృద్ది చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ శాఖలు సమన్వయంతో పనిచేయడం వలన రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు లోకేష్ పేర్కొన్నారు.
 
ముంబైకి చెందిన ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రిని త్వరలో అమరావతిలో ప్రారంభించనునట్లు లోకేష్ మంత్రి శ్రావణ్‌కు తెలియజేశారు. త్వరలో మరో 5 ప్రముఖ ఆసుపత్రులు అమరావతి రాజధానికి తరలి రానున్నట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. అరకు ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ధి చేయాలని మంత్రి శ్రావణ్ కుమార్ పర్యటక శాఖా మంత్రి అఖిల ప్రియను కోరగా ఎవరైనా ముందుకు వస్తే పీపీపీ పద్దతిలో పర్యాటకంగా అరకును ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు.