శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (15:27 IST)

చంపేస్తామని బెదిరిస్తున్నారు : ఎస్పీకి వైకాపా ఎంపీ లేఖ

వెస్ట్ గోదావరి జిల్లా వైకాపా రాజకీయాల్లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని, అందువల్ల తన ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఇదే జిల్లా వైకాపా రాజకీయాల్లో సంచలనంగా మారింది. 
 
ఇటీవల ఎంపీ రాజు ఏపీ వైకాపా ప్రభుత్వ యేడాది పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని, తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. 
 
తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించే సమయంలో రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.