ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 29 అక్టోబరు 2021 (22:42 IST)

వ్యవస్థ మార్పుకు దోహదం చేసే జాతీయ విద్యావిధానం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

నాణ్యమైన ఉన్నత విద్య వ్యక్తిగత సాఫల్యంతో పాటు, సమాజానికి ఉత్పాదక సహకారాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విద్యార్థులను అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి కోసం సిద్ధం చేయవలసిన బాధ్యత విద్యాసంస్ధలపై ఉందన్నారు.
 
తాడేపల్లి గూడెం నిట్‌లో “విజన్ ఆఫ్ ఎన్ఇపి 2020 ఆన్ రీసెర్చ్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ పారామీటర్స్ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్” అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సుకు గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గౌరవ హరిచందన్ ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం 2020 దేశంలోని యువ తరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, దూరదృష్టితో భారత ప్రభుత్వం రూపొందించిన విధానాలలో ఒకటని గవర్నర్ అన్నారు.
 
దేశంలో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు వ్యవస్థను పునరుద్ధరించడం, నేపథ్య పరిస్థితుల కారణంగా ఏ పిల్లవాడు చదువుకు దూరం కాకుండా చూడటమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 2030 నాటికి పాఠశాల విద్యలో 100 శాతం స్థూల నమోదు లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. సంపూర్ణ విద్య సమ్మిళిత, సంస్కారవంతమైన, ఉత్పాదక, ప్రగతిశీల, సంపన్న దేశాన్ని నిర్మించేలా చేస్తుందన్నారు.
 
పరిశోధనలు బలంగా ఉన్న ఉన్నత విద్యా సంస్ధలలో అత్యుత్తమ బోధన, అభ్యాస ప్రక్రియలు మెరుగ్గా ఉంటాయని ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు నిరూపిస్తున్నాయన్నారు. పరిశోధనలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంలో, సమాజాన్ని ఉద్ధరించడంలో, ఒక దేశాన్ని నిరంతరం ప్రేరేపించడంలో కీలక మన్నారు. భారతదేశంలో పరిశోధన, ఆవిష్కరణల పెట్టుబడి జిడిపిలో 0.69శాతం మాత్రమే ఉండగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2.8శాతం, ఇజ్రాయెల్‌లో 4.3 శాతం ఉందని గవర్నర్ అన్నారు.
 
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధనా సంస్కృతి విస్తరించేలా చూసే లక్ష్యంతో నాణ్యమైన అకడమిక్ పరిశోధనను ఉత్ప్రేరకపరుస్తుందన్నారు. సామాజిక సవాళ్లైన పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు.
 
జాతీయ విద్యా విధానం-2020 దేశంలోని విద్యా రంగాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదని,  విద్యను అందుబాటులోకి తీసుకురావడం, సమానత్వంతో అందరినీ కలుపుకు పోవడంపై ఇది దృష్టి సారిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తాడేపల్లి గూడెం నుండి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.ఎస్.పి. రావు తదితరులు పాల్గొన్నారు.