ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (07:54 IST)

విద్యాకానుక‌పై ఎక్క‌డా రాజీ ప‌డొద్దు... పక్కా భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు: జగన్‌

విద్యాకానుకలో ఇంగ్లీష్‌-తెలుగు డిక్షనరీని చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాల నాణ్యత బాగుండాలని, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి దశ నాడు-నేడు పనులు మార్చికల్లా పూర్తి చేయాలి. స్కూళ్ళు కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలి. స్కూళ్ళలో ఇంటీరియర్‌ కూడా బావుండాలి. రెండో దశలో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు.

మనసా వాచా కర్మణ నిబద్ధతతో పనిచేయాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. టేబుల్స్‌ విషయంలో మరింత జాగ్రత్త అవసరం, టేబుల్స్‌ హైట్‌ కూడా చూసుకోవాలి. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానంలో బోధన జరగాలి.

ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుతూ పోవాలి.అలా 2024 నాటికి 10వ తరగతి వరకు  సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలి’’ అని మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా 390 పాఠశాలల భవన నిర్మాణానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.

‘‘ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. కచ్చితంగా భవనాలు కట్టించాలి. నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలి. రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్‌ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.