బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (06:19 IST)

18 అర్ధరాత్రి వరకు వెబ్‌ ఆప్షన్లకు గడువు: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఉపాధ్యాయ బదిలీల వెబ్ ఆప్షన్ తో పాటు సవరణలకు ఈ నెల 18 తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి 12 గంటల వరకూ అవకాశమిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉపాధ్యాయుల్లేక మారుమూల పాఠశాలల మూతపడకుండా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని ఖాళీలకు బ్లాక్  చేశామన్నారు.

వెబ్ ఆప్షన్ ప్రక్రియ పూర్తికాగానే ఈ నెల 19 తేదీ తరవాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు. ఉపాధ్యాయ బదిలీల  కోసం తమ ప్రభుత్వం ప్రయోగాత్మకం చేపట్టిన వెబ్ ఆప్షన్ నూటికి నూరు శాతం విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు.

వెబ్ ఆప్షన్ ను వినియోగించుకున్న ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గురువారం సాయంత్రం 4.30 గంటల వరకూ 76,119 పోస్టుల బదిలీలకు గానూ 74,421 మంది వెబ్ ఆప్షన్ వినియోగించకున్నారన్నారు. కంపల్షరీ కేటగిరీలో 26,117 పోస్టులకు 25,826 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 99 శాతం మంది కంపల్షరీ కేటగిరిలో ఉన్న ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ ను వినియోగించుకున్నారన్నారు. ఇంకా 291 మంది పెండింగ్ లో ఉన్నారన్నారు.

రిక్వెస్టు కేటగిరి కింద 50,002 ఖాళీ పోస్టులకు 48,595 మంది వెబ్ ఆప్షన్లు అందజేశారన్నారు. ఇంకా 1,407 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల అంజేయాల్సిన ఉందన్నారు. మిగిలి పోయిన ఉపాధ్యాయుల కోసం ఈ నెల 18 తేది అర్ధరాత్రి వరకూ వెబ్ ఆప్షన్ వినియోగించుకోడానికి అవకాశమిస్తామన్నారు. సవరణలు చేసుకోదలిచిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

వెబ్ ఆప్షన్ సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, జిల్లాల వారీగా సర్వర్లు విభజించామని తెలిపారు. వెబ్ ఆప్షన్ ప్రక్రియ పూర్తి కాగానే, ఈ నెల 19 వ తేదీ తరవాత బదిలీ ఉత్తర్వుల అందజేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
 
బ్లాకింగ్ ఎత్తేస్తే మారుమూల పాఠశాలల మూత...
సీఎం వైఎస్ జగన్మోహన్  రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీ తనంగా చేపట్టామని మంత్రి వివరించారు. పోస్టుల బ్లాకింగ్ ఎత్తేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 స్కూళ్లో 10,198 పోస్టులు భర్తీ కావని, దీనివల్ల ఉపాధ్యాయుల్లేక ఆ పాఠశాలలు మూతపడే అవకాశముందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే 16 వేల పోస్టులను బ్లాక్ చేసి పెట్టామన్నారు.

ఏయే పాఠశాలల్లో బ్లాక్ చేశామో ఇప్పటికే వివరించామన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ఉపాధ్యాయ బదిలీలపై అనవసర అపోహాలు సృష్టించొద్దని హితవు పలికారు. ఎవరికీ ఇబ్బందుల రానీయకుండా చూస్తామని, అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. 
 
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటన...
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని మంత్ర ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్ ఫీజులపై  నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో అటువంటి కాలేజీల పేర్లను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.