గవర్నర్ ఆదేశాలు బేఖాతర్ : సుప్రీంలో తేలిన తర్వాత తుదినిర్ణయం!!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతల స్వీకారంపై దాగుడు మూతలు, అనిశ్చితి కొనసాగుతున్నాయి. 'నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తగిన చర్యలు తీసుకోండి' అని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో.. నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్ స్పష్టంచేశారనే అభిప్రాయం కలిగింది. కానీ, ప్రభుత్వం మాత్రం దాగుడు మూతలు ఆడుతోంది. దీనికి కారణం లేకపోలేదు.
హైకోర్టు సూచన మేరకు గవర్నర్‌ను కలిసేందుకు వీలుగా ఈనెల 17వ తేదీనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధమయ్యారు. అయితే... గవర్నర్ ఆయనకు 20వ తేదీన సమయం ఇచ్చారు. ఈలోపు... రాష్ట్రప్రభుత్వం చకచకా అడుగులు వేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం (24న) విచారణ జరపనున్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం ఆయన్ను నియమించకపోవచ్చని.. సుప్రీంకోర్టు స్పందించే తీరును బట్టి నిర్ణయం తీసుకోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.