బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:10 IST)

సెక్షన్‌-107 కింద బైండోవ‌ర్ చేసే అధికారం పోలీసులకు లేదు

సెక్షన్‌-107 కింద బైండోవ‌ర్ చేసే అధికారం పోలీసులకు లేద‌ని, ఎస్‌ఐలకు ఈమేర‌కు ఉత్తర్వులివ్వండి అంటూ ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. 
 
సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పరశురాములు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

అల్లర్లను సృష్టించే వారిని సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద బైండోవర్‌ చేసే అధికారం తహసీల్దార్లకు ఉందని, వారి అధికారాన్ని పోలీసులు లాగేసుకుంటున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్‌-107 కింద పోలీసులు లక్షల మందిపై కేసులు పెడుతున్నారని కోర్టుకు వివరించారు.
 
వాదనలు విన్న న్యాయస్థానం, సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద కేసులు నమోదు చేయొద్దని పోలీసుల‌ను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పీఎస్‌ల ఎస్‌ఐలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిటిషనర్‌పై ఆత్మకూరు పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది.