అసెంబ్లీలో అవమానం: నారా భువనేశ్వరి రియాక్షన్
ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు ఎన్టీయార్ మెమోరియల్ మేనిజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తన పేరు మీదున్న లెటర్ హెడ్ తో ఆమె తన స్పందన తెలియజేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణిపై ప్రతిపక్షనాయకులు నిందలు వేశారని కుమిలి కుమిలి ఏడ్చిన ఉదంతం తెలిసిందే.
అప్పటి నుంచి బాబుకు, ఆమె సతీమణికి సంఘీభావంగా ఎంతో మంది టీడీపీ నేతలు, సినీ వర్గాలు, ఇతరులు స్పందిస్తూనే ఉన్నారు. చాలా మంది అధికార వైసీపీని తప్పుపడుతూ, ఖండనలు ఇచ్చారు. ఇపుడు వారందరినీ ఉద్దేశించి నారా భువనేశ్వరి ఒక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు నారా భువనేశ్వరి. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురుకి జరిగినట్లు భావించి, తనకు అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు... నేటికీ మేం వాటిని పాటిస్తున్నాం అని తెలిపారు.
విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టాల్లో, ఆపదల్లో ఉన్న వారికి అండగా నిలవాలని కోరారు. ఇతరుల వ్యక్తిత్వంను కించపరిచేలా, గౌరావానికి భంగం కలిగిచేలా ఎవరూ వ్యవహరించకూడదని పేర్కొన్నారు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాఅంటూ నారా భువనేశ్వరి ఈ లేఖలో తెలిపారు.