1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (11:56 IST)

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు వినాశనం కలిగించాయి. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇవాళ ఏపీలో పర్యటించనుంది.

 
ఈ బృందం మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఓ బృందం పర్యటించనుంది. రేపు కడప జిల్లాలో మరో బృందం పర్యటించనుంది. ఈ రెండు బృందాలు ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నాయి. నవంబర్ 29న కేంద్ర బృందం సభ్యులు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు.

 
వరద బాధితులకు రూ.1000 కోట్ల సాయం ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. మరోవైపు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు వైపు కదులుతోంది, శ్రీలంక తీరాన్ని తాకి బలహీనపడుతుంది. దీంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నా.. తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు కదులుతుందని, అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.