గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఉద్యోగులకు ఓ రాష్ట్రం సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు.. ఏపీపై నిర్మలమ్మ కామెంట్స్

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీనిపై వైకాపా పాలకులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తాము అద్భుతంగా పాలన సాగిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కోట్లాది రూపాయలను ప్రకటనల రూపంలో మంచినీటి ప్రాయంగా తగలేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ దుస్థిని పరోక్షంగా ఎత్తి చూపారు. దేశంలోని ఓ రాష్ట్రం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోతోందని గుర్తుచేశారు. 
 
అయితే, ఉన్న డబ్బుతో మాత్రం దేశ వ్యాప్తంగా భారీగా ప్రకటనలు ఇస్తోందని విమర్శించారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోతుందనే వార్తలు మీడియాలో వస్తున్నట్టు పేర్కొన్నారు. జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు నిరసన కూడా తెలుపుతున్నారని గుర్తుచేశారు. తాను ప్రత్యేకంగా ఆ రాష్ట్ర పేరును ప్రస్తావించడం లేదని, పత్రికల్లో వస్తున్న వార్తలను మీరూ చూడొచ్చు అని అన్నారు. 
 
ప్రభుత్వ వద్ద ఉన్న నిధులను దేశ వ్యాప్తంగా వివిధ మీడియాల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆ రాష్ట్రం చేరుకుని ఉండొచ్చన్నారు. అందువల్ల సబ్సిడీలు, ఉచితాల విషయంలో బేరీజు వేసుకోవాలని, ఎవరైనా వాటిని బడ్జెట్‌లో చూపిస్తే అందుకు తగిన నిధులను కేటాయించాలని సూచించారు. పుష్కలంగా ఆదాయం వస్తుంటే డబ్బులు ఇవ్వడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, విద్య, వైద్యం, రైతులకు మాత్రంమ రాయితీలు ఇవ్వడం మాత్రం న్యాయమేనని చెప్పారు.