మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:33 IST)

గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుగాలి

ఊహించిన విధంగానే గుంటూరు జిల్లా నాలుగోదశ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదురుగాలి వీచింది. అన్ని గ్రామాలను ఏకగ్రీవం చేసు కోవాలనే ఆలోచనకు ఆదిలో గండిపడింది. కేవలం 10శాతం గ్రామాలోనే ఏకగ్రీవాలకు అవకాశం ఏర్పడింది. మిగతా 239 గ్రామాల్లో అధికార పార్టీతో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.

16 మండలాల్లో ఎన్నికలు జరగ్గా రాత్రి 12 గంటలకు మొత్తం 239 పంచాయతీలకు 236 పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 147 మంది, వైసీపీ రెబల్స్‌ 13, గెలిచారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 68 మంది, టీడీపీ రెబల్‌ ఒకరు, జనసేన 4, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు.

వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన కొన్ని గ్రామాల్లో ఫలితాలను తారుమారు చేయటం ద్వారా తమ ఖాతాలో వేసుకున్నారని టీడీపీ వర్గీయులు ఆందోళనలు నిర్వహించారు.  66 గ్రామాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.

ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి ఎన్నోవిధాలుగా ప్రయత్నించి ఫలితాలను ఏకపక్షం చేసుకోవాలని చూశారు. అయినప్పటికీ వారి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగకుండా టీడీపీ వర్గీయులు బరిలోకి దిగటమే కాకుండా ఒకవంతు స్థానాల్లో సత్తా చాటారు.