మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (17:00 IST)

ఆడరౌడీ ఎమ్మెల్యేలు, బూతుల మంత్రులు.. హమ్మ, దివ్యవాణి ఎంతమాటన్నారు?

రాష్ట్రాన్ని రౌడీరాజ్యంగా, దోపిడీకేంద్రంగా మార్చిన వైసీపీప్రభుత్వం, వాలంటీర్లు, వైసీపీకార్యకర్తల సాయంతో అధికారం చేతిలోఉందన్న అహంకారంతో పంచాయతీఎన్నికల్లో పోటీలో నిలిచిన టీడీపీ సానుభూతిపరులను బెదిరించిందని, ప్రభుత్వ బెదిరింపులకు వెరవకుండా బరిలోనిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని టీడీపీ అధికారప్రతినిధి శ్రీమతి దివ్యవాణి తెలిపారు.
 
ఆమె తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. అనేకచోట్ల స్వల్పతేడాతో ఓటమిపాలైన టీడీపీ సానుభూతిపరులంతా బాధపడాల్సిన పనిలేదన్న ఆమె, దౌర్జన్యంగా, దుర్మార్గంగా గెలిచినవారికి ఎప్పటికైనా శిక్షతప్పదన్నారు. గెలిచిన వైసీపీ మద్ధతుదారులు ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసేలా టీడీపీ వారు నిత్యం వారిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
 
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం రాష్ట్రవాసులు రోడ్డెక్కడం బాధాకరమన్న దివ్యవాణి, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ దీక్షను బలవంతంగా విరమింపచేయాలని ప్రయత్నించడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్నాడని తెలిసిన వెంటనే ప్రభుత్వం పల్లా దీక్షను భగ్నం చేసిందన్నారు. టీడీపీ అధినేత విశాఖకు వెళ్లి, అక్కడ ఉద్యమం చేస్తున్న వారికి సంఘీభావం తెలపడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేత అంబటి రాంబాబు అసహ్యంగా, జుగుప్సాకరమైన భాషతో మాట్లాడటం సిగ్గుచేటని దివ్యవాణి ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు, విశాఖ ఉక్కు ఉద్యమం మొదలైనప్పుడు ఏనాడూ స్పందించని వైసీపీ నేతలు, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని భావించిన వెంటనే ఆయనపై విమర్శలకు దిగుతున్నారన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నాడంటే, అంబటి రాంబాబు సహా, వైసీపీ నేతలు ఎందుకంతలా భయపడుతున్నారో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఏమీ తెలియనివాళ్లలా ఎందుకు నటిస్తున్నారో వారే సమాధానం చెప్పాలన్నారు. 
 
చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి వెళ్లడానికి రెండ్రోజుల ముందు బూతుల మంత్రి ఏం మాట్లాడారో అంబటి గ్రహించాలన్నారు. చంద్రబాబు, టీడీపీ జగన్ చిటికెనవేలుపై ఉన్న వెంట్రుకను కూడా పీకలేరని బూతుల మంత్రి అంటే, దానిలో అంబటికి తప్పేమీ కనిపించకపోవడం సిగ్గు చేటన్నారు. బూతుల మంత్రి అలా మాట్లాడబట్టే, విశాఖలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మంత్రి ఏం పీకుతున్నాడని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఏ భాష మాట్లాడేవాడికి ఆభాషలోనే సమాధానం చెప్పాలి కాబట్టి చంద్రబాబునాయుడు అలా మాట్లాడారన్నారు.
 
స్త్రీలను గౌరవించే సమాజంలో ఉంటూ, వైసీపీ మహిళా నేతలు, ఆ పార్టీలోని మహిళా రౌడీ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు, అంబటి రాంబాబు చెవులకు ఇంపుగా ఉన్నా, ప్రజలు వాటిని తట్టుకోలేక పోతున్నారన్నారు. ప్రత్యేకహోదా రావాలంటే, 25 మంది ఎంపీలను గెలిపించాలని కోరిన జగన్, ఇప్పుడు తన ఎంపీలతో ఏం పనులు చేయిస్తున్నాడో అంబటి రాంబాబుకు తెలియదా అని దివ్యవాణి నిలదీశారు. అమరావతిని ఎక్కడికీ మార్చేది లేదని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్, ఇప్పుడు భూములిచ్చినవారిని రోడ్లపైకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అన్నారు.
 
అమ్మఒడి పథకాన్ని ప్రతి విద్యార్థికి అమలు చేస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే ప్రతి తల్లికి దాన్ని వర్తింప చేయలేదా అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినవారు, ఇప్పుడు నాసిరకం మద్యం అమ్ముతూ, ప్రజలను దారుణంగా దోచుకుంటన్నారన్నారు. అబద్ధాలు చెప్పడం, అన్యాయంగా పాలన చేయడం, జగన్‌కే చెల్లింది తప్ప, చంద్రబాబుకు కాదనే వాస్తవాన్ని అంబటి రాంబాబు వంటివారు గ్రహిస్తే మంచిదన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తానని చెప్పిన జగన్, అసెంబ్లీలో ఏమీ తెలియని వాడిలా అమయాకంగా తమ మేనిఫెస్టోలో అటువంటి హామీ లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.
 
మనసులో ఒకటి ఉంచుకొని, బయట మరోలా నటించడం జగన్ వంటి వారికే సాధ్యమైందన్నారు. జగన్ ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇతరత్రా వర్గాలన్నింటినీ ఎలా మోసగించి, వంచించిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబానాయుడి గురించి మాట్లాడే ముందు వైసీపీ నేతలు, మంత్రులు తమ స్థాయి ఏమిటో గ్రహిస్తే మంచిదని దివ్యవాణి హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్, పోస్కో కంపెనీతో చేసుకున్న ఒప్పందం వివరాలను స్వయంగా కేంద్రమంత్రే బహిర్గతం చేసినా ముఖ్యమంత్రి తన జగన్నాటకాలు ఆపడం లేదన్నారు.
 
పోస్కో కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు జగన్‌తో తాడేపల్లిలో సమావేశమయ్యారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రజలకు ఏమీ తెలియదని, ఒప్పందానికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు లేవన్నట్లుగా జగన్, ఆయన పార్టీ వారు నాటకాలు ఆడుతున్నారని దివ్యవాణి ఎద్దేవా చేశారు. పోస్కో కంపెనీ వారితో ముఖ్యమంత్రి జరిపిన చర్చల వివరాలను ఇంతవరకు ఎందుకు బహిర్గతంచేయలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముందే ఒప్పందాలు చేసుకొని, తరువాత ఏమీ తెలియని వారిలా కేంద్రానికి తాము లేఖలు రాశామని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. 
 
ఉక్కునగరంగా పేరుపొందిన విశాఖనగరం, విజయసాయి నేత్రత్వంలో స్టోలెన్ సిటీగా మారిందన్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేయడం, విశాఖలో దోపిడీకీ శ్రీకారం చుట్టడం వంటి చర్యలకు పాల్పడిన వారికి ఏదోఒక రోజు ప్రజల చేతిలో తగినవిధంగా శాస్తి జరగక తప్పదన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తక్షణమే అడ్డుకొని,  కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపి, అన్నింటిపై ధరలు పెంచి, రూపాయి కూడా పెట్టుబడులు ఏపీకి తీసుకురాకుండా చేసిన ముఖ్యమంత్రి ప్రజలకు అల్లా, జీసస్ ఎలా అవుతాడన్నారు.
 
అధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంటే, పెట్రోల్ డీజిల్ పెంపులో రెండోస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబం పై రూ.2 లక్షల 35 వేల రూపాయల వరకు జగన్ ప్రభుత్వం అప్పులభారం మోపిందని డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాలే చెబుతున్నాయన్నారు. ఈ విధంగా అప్పులకుప్పగా రాష్ట్రాన్ని మార్చిన జగన్ అండ్ కో, చివరకు బెదిరింపులు, దౌర్జన్యాలే పెట్టుబడిగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపును సాధ్యం చేసుకుందన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని, ఏదిపడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని వైసీపీకి చెందిన ఆడరౌడీ ఎమ్మెల్యేలు, బూతుల మంత్రులు, ఇతర నేతలు గ్రహిస్తే మంచిదన్నారు.