గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మిస్టర్ నిమ్మగడ్డా.. ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? : తమ్మినేని సీతారాం

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ నిమ్మగడ్డా.. ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. 
 
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేయడంపై తమ్మినేని మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌ పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌లా ఉందని, బాధ్యత గల అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 
 
రాష్ట్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ వైఖరి సరికాదన్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సాగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనన్నారు. 
 
కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి, ఏకగ్రీవాలు కూడా అయ్యాక ఎన్నికలు నిలిపేసిన ఎన్నికల కమిషనర్‌.. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 
 
ఎన్నికలు వద్దని ప్రజలు, ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏమవుతుందో గుర్తెరగాలని హితవు పలికారు. నియంతృత్వ పోకడలకు విరుగుడు ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కటేనన్నారు. ఎన్నికలపై ఈసీ పునరాలోచన చేయాలని ఆయన సూచించారు.