సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (18:33 IST)

క్రియాశీలక సభ్యత్వ నమోదుకు జనసేనాని పిలుపు

మరో రెండేళ్ళలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై దృష్టిసారించారు. ముఖ్యంగా, పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 
 
ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీలక సభ్యత్వం నమోదయ్యేలా జనసైనికులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతోందని, దీన్ని మరింతగా పటిష్టం చేయాలని ఆయన కోరారు. 
 
ఇకపోతే, గతంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని, లక్ష మందికి ఈ సౌకర్యం వర్తింపజేశామని తెలిపారు. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని పపన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదువల్ల ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొని, భారీ ఎత్తున సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు.