శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (17:50 IST)

తెగించి రోడ్లపైకి వస్తే మీరుండరు... ఇదే లాస్ట్ వార్నింగ్ : పవన్ కళ్యాణ్

వైకాపా ప్రజాప్రతినిధులకు, నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరొక్కసారి బూతులు మాట్లాడినా, జనసైనికులపై దాడులు జరిగినా సహించబోనని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం ఓ సమస్య కాబోదన్నారు. కానీ, తాము బలంగా ఉన్నామని, అందుకే ఇప్పటికీ శాంతియుతంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైకాపా కార్యకర్తలదాడిలో తీవ్రంగా గాయపడిన జనసైనికులను ఆయన మంగళవారం స్వయంగా పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన కార్యకర్తలపై దాడి దురదృష్టకరమన్నారు. పండుగ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం శోచనీయమన్నారు.
 
ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి వాడిన భాష దారుణమన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి వాడకూడని భాష ఉపయోగించారని ఆయన మండిపడ్డారు. మా ఆడపడుచులను దూషించడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సహనం చేతకాని తనం కాదన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలనుకుంటే మీరెవరూ ఇక్కడ ఉండరన్నారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి భాషవాడే ప్రజాప్రతినిధిని చూడలేదని వ్యాఖ్యానించారు.
 
పచ్చిబూతులు తిట్టి.. దాడులు చేస్తే పోలీసులు చోద్యం చూడటం సరికాదన్నారు. పోలీసులు సుమోటోగా తీసుకొని విచారించాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అలాగే, ఇంకొక్క సంఘటన మావాళ్లపై జరిగితే చేతులు కట్టుకొని కూర్చోమన్నారు. 
 
ముఖ్యంగా, వైకాపాకు అధికారంలోకి వస్తే పాలెగాళ్ళ రాజ్యం, ఫ్యాక్షనిస్టుల రాజ్యం వస్తుందని గతంలో తాను పలుమార్లు చెప్పానని, ఇపుడు అదే జరుగుతోందన్నారు. పైగా, కనుచూపుమేరలో పచ్చగా, ప్రశాంతంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం నెలకొనడం, రాజకీయ సంఘటనలు, ఉద్రిక్తలు, బూతులు తిట్టడం ఇపుడే చూస్తున్నామన్నారు. తుని సంఘటన జరిగిన సమయంలో కూడా పోలీసులు చాలా సమర్థంగా నిర్వహించారని పవన్ కొనియాడారు. 
 
అలాగే, తన ఢిల్లీ పర్యటనకు గల కారణాలను కూడా పవన్ వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులను, రాజకీయాలను, పెట్టుబడులు వెనక్కి వెళ్లడం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాననని చెప్పారు. అలాగే, ఈనెల 16వ తేదీన జనసేన - బీజేపీ నేతల మధ్య అత్యంత కీలకమైన సమావేశం జరుగుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 
 
ప్రభుత్వం కావాలనే లేనిపోని గొడవలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని చెప్పారు. పోలీసులు కూడా చోద్యం చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని తాము అనుకుంటే.. వైసీపీ వాళ్లు ఇక్కడ ఉండలేరని హెచ్చరించారు. తామ తెగించి రోడ్లపైకి వస్తే ఏమీ చేయలేరని పవన్‌ వ్యాఖ్యానించారు. 
 
పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేస్తారా?.. గొడవకు కారణమైనవారిపై సుమోటోగా కేసు పెట్టకుండా..నిరసనలు చేస్తున్నవారిని అరెస్ట్‌లు చేస్తారా? అంటూ పవన్ ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా? అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీస్‌శాఖ చూస్తూ కూర్చోవడం దారుణమని అన్నారు. వైసీపీ నేతలు స్థాయి దాటి మాట్లాడుతున్నారని, సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
 
పాలెగాళ్ల రాజ్యం తీసుకొస్తామంటే ప్రజలు సహించరని పవన్‌ కల్యాణ్ అన్నారు. ఎస్పీ స్పందించి దాడులు చేసినవారిపై కేసులు పెట్టాలని, అన్యాయాలకు పోలీసులు గొడుగు పట్టొద్దని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరిగితే పోలీసులదే బాధ్యతని,తమకు రోడ్లపైకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అన్నారు. పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికే.. వైసీపీలో మదమెక్కిన నేతలు మాట్లాడుతున్నారని, వైసీపీ నేతల మదాన్ని ప్రజలు అణచివేస్తారని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.
 
రాజధానిని తరలిస్తామని పదేపదే చెబుతున్నారు. రాజధానిని తరలించాలని భావించేవాళ్లు.. గ్రామ సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీశారు. పైగా, అమరావతిలో అన్ని శాఖలు పని చేస్తున్నాయన్నారు. అలాగే, ఉద్యోగస్తులు కూడా స్థిరపడ్డారని గుర్తుచేశారు. వారికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించింది. ప్రత్యేక రైలుతో పాటు.. వారానికి ఐదు రోజుల పనిదినాన్ని కల్పించిందని గుర్తుచేశారు. వీటన్నింటికి ప్రజల డబ్బే ఖర్చు చేస్తున్నారని, చంద్రబాబువో లేక జగన్‌వో కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని పవన్ అన్నారు.