సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (14:32 IST)

పర్వతం ఎవరికీ వంగి సలామ్ చేయదు : పవన్ కళ్యాణ్

'సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. పర్వతం ఎవరికీ ఒంగి సలామ్ చేయదు' అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు గర్జించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ జాతీయ పతాకాన్

'సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. పర్వతం ఎవరికీ వంగి సలామ్ చేయదు' అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు గర్జించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
 
'భారతీయుడైన నేను, భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, ప్రకృతికి నష్టం కలిగించకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ, అనునిత్యం దేశ ప్రజల శ్రేయస్సుకై పరితపిస్తూ, దేశప్రజలందరి ఎడలా సహోదర భావం కలిగివుంటూ, ఎటువంటి కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా పాటిస్తూ, మన ఆడపడచుల పైన, మన అక్క చెల్లెళ్లపైనా, మన మహిళలపైనా పేగుబంధం కలిగి, వారిని సంరక్షించే బాధ్యత కలిగిన వాడిగా నడుచుకుంటానని, దేశ చట్టాలను గౌరవిస్తూ, దేశాభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని, దేశ సాక్షిగా, జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అని ప్రతిజ్ఞ చేయించారు. 
 
ఆపై ఆయన ప్రసంగింస్తూ, 'సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. పర్వతం ఎవరికీ ఒంగి సలామ్ చేయదు. మనమంతా కలిపి పిడికెడు మట్టే కావచ్చు. కానీ, మనం జెండా ఎత్తితే ఉవ్వెత్తున ఎగసిపడే గుండె ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మగౌరవ నినాదం రెపరెపలాడుతుంటాయి' అని పవన్ వ్యాఖ్యానించారు. జాతీయ జెండాలో ఉన్న రంగులు మతాలకు ప్రాతినిధ్యం కానేకాదని వివరించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి పోవాలన్నారు. యువతలో, విద్యార్థుల్లో దేశభక్తి నిండా ఉందన్నారు.