శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:25 IST)

మంగళగిరిలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పవన్ దీక్ష

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు(ఆదివారం) దీక్ష చేయనున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఆయన ఈ దీక్ష చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం  మంగళగిరికి వస్తారు. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు తన సంఘీభావంగా  దీక్షలో కూర్చొంటారు. ఈ విషయంపై జనసేన పార్టీ శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
కాగా, నష్టాల్లో ఉన్న ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజలంతా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 
 
అయితే, కేంద్రం మాత్రం తాము తలపెట్టినిని విజయవంతంగా పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వారికి సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఇపుడు మరోమారు మంగళగిరిలో పార్టీ నేతలతో కలిసి దీక్షలో కూర్చోనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ దీక్షలో పవన్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు.