జగన్ ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో చెప్పిన పవన్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయింది. ఈ ఆరు నెలల పాలనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరు మాటల్లో తేల్చిపారేశారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తన వరుస ట్వీట్లలో ఆరు మాటలు, వాటికి వివరణలను పొందుపరిచారు.
'శ్రీ జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే... విధ్వంసం, దుందుడుకుతనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం' అంటూ ట్వీట్ చేశారు.
మొదటి రెండు... విధ్వంసం, దుందుడుకుతనం పదాలను వివరిస్తూ... 'కూల్చివేత పర్వాలు, వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు, కాంట్రాక్టు రద్దులు' అంటూ ట్వీట్ చేశారు.
మూడో పదంగా.. కక్షసాధింపుతనం గురించి ప్రస్తావించారు. శ్రీకాకుళంలో జనసైనికులపై కేసులు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై కేసులు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఉరివేసుకోవడం, జర్నలిస్టులపై దాడులు తదితర అంశాలననేకం ఉన్నాయంటూ గుర్తుచేశారు.
నాలుగో పదం 'మానసిక వేదన'ను వివరిస్తూ.. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం, వివిధ కులాలపై వేధింపులు అని పేర్కొన్నారు. ఐదో అంశం 'అనిశ్చితి' గురించి మరో ట్వీట్‌లో ప్రస్తావిస్తూ... రాజధాని అమరావతి ఉంటుందా? కేంద్రం ఏపీకి నిధులు ఇస్తుందా? అంటూ వరుస ప్రశ్నలను సంధించారు.
6వ అంశం 'విచ్ఛిన్నం' అన్న దానిని వివరిస్తూ... 'ఆంగ్ల భాషలో బోధన అన్న వాదనతో తెలుగు భాషనీ, సంస్కృతిని, భారతీయ సనాతన ధర్మ విచ్ఛిన్నానికి శ్రీకారం చుట్టారు' అని ట్వీట్ చేశారు.