బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (09:03 IST)

నేడు వైజాగ్‌కు జనసేనాని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం వైజాగ్‌కు రానున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగే పోరాటనికి నేరుగా మద్దతు తెలిపేందుకు ఆయన విశాఖపట్టణం వస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సహకారంతో భారీ సభ జరుగనుంది. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి స్వయంగా మద్దతు తెలిపేందుకు ఆదివారం మధ్యాహ్నం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ వద్ద దీక్ష చేస్తున్న కార్మికులు, నిర్వాసితుల శిబిరాలను జనసేనాని సందర్శిస్తారు. 
 
అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని పార్టీ విధానం వెల్లడిస్తారు. ఇక…ఇప్పటికే జనసేన తన సంపూర్ణ మద్దతును ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి ప్రకటించింది. 
 
అయితే, పవన్ కళ్యాణ్ రావడం ఉద్యమ వేడిని మరింత పెంచుతుందనే అభిప్రాయం ఉంది. బహిరంగ సభ కంటే ఆ వేదికపై జనసేన అధ్యక్షుడు ఎలా రియాక్ట్ అవుతారా?అనే ఉత్కంఠ కార్మికులు, రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. 
 
మొదటి నుంచి జనసేన విధానం ప్రైవేటీకరణకు వ్యతిరేకమే. కొత్తగా పవన్‌ ఏవైనా డిమాండ్లను కేంద్రం ముందు పెడతారా?అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతో ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు కంకణం కట్టుకుంది. ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయం కనుక ఎటువంటి మార్పు లేదని తెగేసి చెబుతోంది.
 
అదేసమయంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. సోమ, మంగళవారాలు పవన్‌ విశాఖలోనే ఉంటారు. ప్రతీ జిల్లా నుంచి 500 మందికి తగ్గకుండా ఈ సమీక్షలకు హాజరుకానున్నట్టు సమాచారం. 
 
మరోవైపు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో సభ నిర్వహణకు జనసేన అంగీకరించలేదు. కానీ, ఇతర ప్రాంతాల్లో సభ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. మొత్తానికి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీ తర్వాత విశాఖ ఉక్కు ఉద్యమం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.