సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (09:34 IST)

హద్దు మీరితే కఠిన చర్యలు - అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన జనసేనాని!!

pawan kalyan
తన అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ అధికారులను కించపరిచేలా నోరుపారేసుకోవద్దని ఆయన కోరారు. ఈ విషయంలో హద్దు మీరితే కఠన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జనసేన పార్టీ అధినేతగా, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
'అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఏపీ పాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలవాలి. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా మాట్లాడినా, నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాదు, ప్రోటోకాల్ కు విరుద్ధంగా అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రోటోకాల్ గీత దాటే వారి పైనా చర్యలు ఉంటాయి' అని హెచ్చరించారు.