వృద్ధురాలి మృతదేహానికి పింఛన్, వేలిముద్రలు: వార్డు వాలంటీర్ అందుకే ఇచ్చాడట..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వార్డు వాలంటీర్లు అర్హులైనవారి ఇళ్లకు వెళ్లి ప్రతి నెలా మొదటి తేదీన ఇస్తుంటారు. ఐతే ఈరోజు విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామానికి చెందిన త్రినాథ్ అనే వాలంటీరు, అదే గ్రామానికి చెందిన ఎర్రనారాయణ అనే వృద్ధురాలికి పెన్షన్ ఇవ్వాలని వెళ్లాడు.
ఐతే ఆమె అనారోగ్యంతో మరణించడంతో ఆమె మృతదేహాన్ని ఇంటిముందు పెట్టారు. వాలంటీర్ త్రినాథ్ పరిస్థితిని చూశాడు. ఇచ్చేందుకు పింఛన్ తీసుకువస్తే వృద్ధురాలు మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పెన్షన్ డబ్బును ఆమె కుటుంబ సభ్యులకు అందించాడు.
పింఛన్ తీసుకున్న వ్యక్తి వేలిముద్రలు కావాల్సి వుండటంతో మృతురాలి వేలి ముద్రలు తీసుకుని వచ్చేసాడు. ఐతే వాలంటీర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చనిపోయినవారికి పెన్షన్ ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తుంటే... ఆ సమయంలో మానవత్వంతో ఆలోచించి ఆ పని చేసాడని మరికొందరు అంటున్నారు. అధికారులు మాత్రం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.