నా కుమార్తె పెళ్ళికి రండి... ఎన్నికల ఫలితాలు లైవ్‌లో చూడండి..
సాధారణంగా పెళ్ళికి వెళితే బంధువులతో కలిసిపోయి హడావిడి చేస్తూ ఎన్ని సమస్యలున్నా మర్చిపోతూ ఉంటాం. అంతేకాదు అందరిలో కలిసిపోయినప్పుడు ఆ ఆనందం, సంతోషమనేది వేరు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాల వేడి కనిపిస్తున్న విషయం తెలిసిందే. మే 23వ తేదీన ఎవరు గెలుస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఇలాంటి సమయంలో పెళ్ళిళ్ళు పెట్టుకునే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. పెళ్ళిళ్ళకు హాజరయ్యేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే ఎన్నికల ఫలితాలనేది రాజకీయ నాయకులు మాత్రమే చూసేది కాదు. ఎవరైనా సరే ఆసక్తికరంగా తిలకించేంది ఫలితాల గురించే. అందుకే పెళ్ళిదేముందిరా పెళ్ళికొడుకు.. పెళ్ళికూతురు ఉంటే చాలు పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్ళికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదులే. మరో రోజు తీరిక చూసుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి వద్దాములే అని ఊరుకుంటుంటారు.
కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే ఒక పెళ్ళి బృందం ఏకంగా పెళ్ళిలోనే కౌంటింగ్ ఫలితాలను టివీల్లో ప్రత్యక్ష ప్రసారం చూపిస్తామని, ఎవరూ ఫలితాలు మిస్సయ్యే అవకాశం లేదని పెళ్ళిపత్రికలో ప్రింటింగ్ చేయించింది. ఇది బహుశా మొదటిసారి అనుకోవచ్చు. పెళ్ళి జరుగుతుండగా పెళ్ళి వేడుకల్లో నాలుగు టివీలను పెడుతున్నాం. ఫుల్ సౌండ్ ఉంటుంది.
పెళ్ళి జరుగుతుంటుంది. లైవ్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు పెళ్ళి బృందం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం ప్రాంతానికి చెందిన ఒక దుస్తుల దుకాణం యజమాని భయ్యా వాసు తన కుమార్తె వివాహం సంధర్భంగా ఇలా పెళ్ళి పత్రికను వేయించి బంధువులను ఆహ్వానిస్తున్నారు.