బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (11:07 IST)

ఉలిక్కిపడిన రేణిగుంట.. రైలు పట్టాల పక్కన పేలుడు.. కారణం చెప్పిన ఖాకీలు!

ఎపుడూ ప్రశాంతంగా ఉండే రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేణిగుంట - తిరుపతి మార్గంలోని రైలు పట్టాల పక్క భారీ పేలుడు సంభవించింది. రేణిగుంట మండలం తారాకరామానగర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఓ డబ్బాను కదిలించడంతో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడుతో రేణిగుంట పట్టణ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో శశికళ అనే పశువుల కాపరికి తీవ్రగాయాలు కాగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్ పైకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
అయితే, ఈ పేలుడు జరిగిన సమయంలో అక్కడ వర్షం పడుతోంది. అక్కడే పశువులు మేపుతున్న శశికళ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించిన డబ్బాను కదిపింది. దాంతో పేలుడు ధాటికి శశికళ చేయి బాగా దెబ్బతింది. రైలు పట్టాలపై పేలుడు జరిగి ఉంటే ట్రాక్ దెబ్బతిని ఉండేదని పోలీసులు భావిస్తున్నారు.
 
కాగా, పట్టాల పక్కనే ఉన్న డబ్బాను కదిలించడంతో విస్ఫోటనం జరిగింది. అయితే ఆ డబ్బా అక్కడికి ఎలా వచ్చిందన్న విషయమై పోలీసులు దర్యాప్తు జరపగా, అసలు విషయం వెల్లడైంది.
 
ఈ ప్రాంతంలో ఉన్న బాలాజీ వెల్డింగ్ వర్క్స్‌లో హీట్ రెసిస్టింగ్ పనులు జరుగుతుండగా, ప్రమాదకర పదార్థాల అవశేషాలతో కూడిన డబ్బాను రైలు పట్టాల వద్ద పారేశారు. నిర్లక్ష్యంగా వదిలేసినందునే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనకు బాలాజీ వెల్డింగ్ వర్క్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, డబ్బాను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, దాన్ని అలాగే వదిలేసి వెళ్లారని పోలీసులు తెలిపారు. వెల్డింగ్ వర్క్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.