జనసేన పార్టీ ఆవిర్భావ సభ - ర్యాలీలపై కృష్ణా పోలీసుల ఆంక్షలు
సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తేదీన జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నేతలుభారీ బహిరంగ సభతో పాటు ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. అయితే, జనసేన సభ, ర్యాలీలపై కృష్ణా జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు., జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. పైగా, జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. అందువల్ల అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇంకోవైపు, మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సభకు ప్రజలు సునామీలా వస్తారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వచ్ఛందంగా గెలవలేక అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలని వైకాపా నేతలు చూస్తున్నారని, వారి ఆగడాలకు అంతేలేకుండా పోయిందని విమర్శించారు.