1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (11:04 IST)

ఏపీలో ప్రశాంతంగా సాగుతున్న పంచాయితీ పోరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల వాయిదాపడిన 36 సర్పంచ్, 68 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. అనంతరం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, మొత్తం సర్పంచ్ స్థానాల్లో ఇప్పటికే 30 సర్పంచ్ స్థానాలు, 380 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 
 
కాగా, రేపు నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
 
తెదేపా అభ్యర్థి భర్త కిడ్నాప్ 
అధికార వైకాపా పార్టీ అండతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఆదివారం జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 4వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త.. మామిడాల మధును అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న నవాబుపేట పోలీసులు పీఎస్‌కు తరలించారు. 
 
అతని జేబులో రూ.2వేలు ఉన్నాయనే సాకుతో అక్రమంగా నిర్బంధించారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న తెదేపా నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
అర్థరాత్రి నుంచి ఆయన స్టేషన్‌ ఆవరణలో బైఠాయించారు. మధును విడుదల చేయకపోవడంతో కోటంరెడ్డి నిరసన కొనసాగుతోంది. 4వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం ఖాయం కావడంతో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ప్రోద్బలంతోనే పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.