ఏపీ ప్రజలు బై బై బాబు అని చెప్పబోతున్నారు : ప్రశాంత్ కిశోర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు ఎంతో విజ్ఞతతో కూడిన తీర్పును ఇవ్వనున్నారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త, జేడీయు నేత ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. గురువారం జరుగుతున్న ఏపీ శాసనసభ ఎన్నికల పోలింగ్ సరళిపై ఆయన మాట్లాడారు.
ఏపీ ప్రజల నమ్మకం, విశ్వాసం కోల్పోయిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అంతలా దిగజారిపోయారని దుయ్యబట్టారు. పోలింగ్ ముగియడానికి మరికొన్ని గంటలే ఉన్నప్పటికీ తమ తీర్పు ఏమిటో ఏపీ ప్రజలు డిసైడ్ చేసేశారని వ్యాఖ్యానించారు. 'బైబై బాబు' అని చెప్పాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.
మరోవైపు, పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే టీడీపీ నేతలు హింసాత్మక సంఘటనలతో ఓటర్లను హడలెత్తించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు కుట్రలు పన్నుతున్న టీడీపీ నేతలు ఆ నిందలను వైసీపీ నేతలపై మోపుతున్నారని తెలిపారు.
వేటకొడవళ్లతో దాడులకు పాల్పడుతోంది టీడీపీ నేతలేనని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబునాయుడు సైతం ఎన్నికల అధికారులను బెదిరించే విధంగా మాట్లాడారని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కడప జిల్లాలో సైతం కొందరు పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని అన్నారు.