గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By సందీప్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (17:51 IST)

ఎన్నికల సంఘం పక్షపాతం... విమర్శలతో ఉక్కిరిబిక్కిరి

తెలుగు రాష్ట్రాల్లో ఈసీ తీరుతెన్నులు విభిన్నంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యవహారశైలిపై ఆరోపణలు వస్తున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నిఘా వర్గాల డీజీ, పలు జిల్లాల ఎస్పీలు వీరందరినీ బదిలీ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎన్నికల సంఘం తీరు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఏపీ అధికార పక్షంపై విపక్షం ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకున్న ఈసీ తెలంగాణలో మాత్రం భిన్నంగా వ్యవహరించడంపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. 
 
ఏపీలో కఠినంగా ఉన్న ఈసీ తెలంగాణలో మాత్రం అధికారపక్షం వ్యవహారశైలి మీదా అధికారుల మీద ఫిర్యాదులు చేస్తే పట్టనట్లుగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నకు సమాధానం అందడంలేదు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈసీ, ఈ విభిన్న పోకడలను ప్రదర్శించి మరింత దిగజారుతోంది.
 
స్వాతంత్ర్య వ్యవస్థగా ఉండే ఎన్నికల సంఘం తీరు ఎక్కడైనా ఒకేలా ఉండాలే తప్పించి వేర్వేరుగా ఉండకూడదంటున్నారు. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదని. వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేసేలా ప్రవర్తిస్తున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. ఏపీలో అంత చురుగ్గా వ్యవహరిస్తున్న ఈసీ తెలంగాణలో మాత్రం ఫిర్యాదుల విషయంలో అంతే చురుగ్గా ఎందుకు వ్యవహరించటం లేదన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.