ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:27 IST)

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు

ప్ర‌ముఖ‌ రేడియేషన్‌ ఆంకాలజిస్టు, అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన్ని కేబినెట్‌ హోదాలో రెండు సంవత్సరాల పదవీ కాలంతో సలహాదారుగా నియమిస్తూ, సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. 
 
క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని ముఖ్యమంత్రి కోరిన విషయం విదితమే. రేడియేషన్‌ ఆంకాలజీలో దేశంలో డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్‌ సెంటర్, గైనకాలజిక్‌ ఆంకాలజీ, హెడ్, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్‌ ప్రోగ్రాంల కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 
 
న్యూయార్క్‌ హాస్పిటల్‌ క్వీన్స్‌లో ఆంకాలజీలో ప్రతి సబ్‌ స్పెషాలిటీలో ట్యూమర్‌ కాన్ఫరెన్స్‌లను ప్రారంభించారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు.  ఆయన సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన  డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.