బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 21 జనవరి 2022 (16:06 IST)

ప్రేమ బాణాలతో తిట్లపురాణం అందుకున్న ఒకే పార్టీ ఎంపిలు.. ఎవరు?

ఒకరేమో ప్రజలతో ఓట్లేయించుకుని గెలిచిన ఎంపి, మరొకరేమో రాజ్యసభ ఎంపి. ఇద్దరిదీ ఒకే పార్టీ. కానీ ఒక ఎంపి మాత్రం అధికార పార్టీలో ఉన్న నేతల్నే విమర్సిస్తూ తెగ హడావిడి చేసేస్తుంటారు. గెలిచింది వైసిపి జెండా అయినా ఆ జెండాతో గెలవడమే కాకుండా తన సొంత చరిష్మాతోనే గెలిచినట్లు చెబుతుంటాడు.

 
అవిశ్వాసం పెడదామంటే అది సాధ్యం కావడం లేదంటాడు. పార్టీ అధినేతపైనా, తనను విమర్సించే వారిపైనా తిట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ ఎంపి రఘురామక్రిష్ణమరాజు. ఇదంతా ఒకే అయితే ఇప్పుడు ఆయన విమర్సించేది మరో ఎంపి విజయసాయిరెడ్డిని.

 
వీరిద్దరి మధ్య ట్వీట్ల వార్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో నడుస్తోంది. విమర్సల బాణాల నుంచి ప్రేమ బాణాలుగా మారి తిట్లపురాణం మొదలెట్టారు ఇద్దరు ఎంపిలు. తాజాగా రఘురామక్రిష్ణమరాజు చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది.

 
అసలు రఘురామక్రిష్ణమరాజు ఏం ట్వీట్ చేశారంటే.. నువ్వు నీ ప్రేమ బాణాలు.. విశాఖ నవ యువతల మీద విసురుతున్నావు అంటూ... పనిచేయకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్ళతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఎ-1 నీకు రాజ్యసభ రెన్యువల్ చేయడు అంట. ముందు నువ్వు ఎ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చేసుకో అంటూ ట్వీట్ చేశాడు.

 
దీనికి స్పందించిన విజయసాయిరెడ్డి.. ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా..? నలభై యేళ్ళ అనుభవమే ఈ వయస్సులో పక్క వాళ్ళకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమ కోసం పడరాని పాట్లు పడుతున్నావా.? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబుతున్నావా అంటూ మరో ట్వీట్ చేశాడు.

 
ఈ ఇద్దరి ట్వీట్లు కాస్త పెద్ద దుమారానికే కారణమవుతోంది. వైసిపిలోనే కాదు ఇతర పార్టీల్లోను చర్చకు దారితీస్తోంది. వీరి ట్వీట్లు ఏ స్థాయికి చేరుతుందోనన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.