బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (15:45 IST)

చంద్రబాబుకి షర్మిల కుమారుడి పెళ్లి ఆహ్వానం: పసుపు చీర కట్టుకుని పసుపు బొకే ఇచ్చారనీ...

YS Sharmila invited Chandrababu for her son's marriage
కర్టెసి-ట్విట్టర్
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి వచ్చే నెల 17వ తేదీన జరుగనుంది. ఈ నేపధ్యంలో తమ కుమారుడి పెళ్లికి రావాలంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రిక అందించి పిలిచారు వైఎస్ షర్మిల. శనివారం స్వయంగా చంద్ర బాబు నివాసానికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించారు. తమ మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగిందని షర్మిల వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ భేటీలో షర్మిల, బాబు చర్చించుకున్న విషయాలపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. 
 
షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో తాము రాజకీయ విషయాలను చర్చించలేదన్నారు. దివంగత వైఎస్‌ఆర్‌తో తనకున్న స్నేహానికి సంబంధించిన పాత రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారని, తన కుమారుడి వివాహ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు.
 
షర్మిల మాట్లాడుతూ ..మేము వృత్తిరీత్యా రాజకీయ నాయకులం. కానీ మనమందరం మొదట మనుషులం. రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఒకరినొకరు పిలుచుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి కానీ మనకు వ్యక్తిగత శత్రుత్వం ఉందని కాదు. మా నాన్నగారికి మంచి స్నేహితుడైన బాబు గారు మా అబ్బాయి పెళ్లికి హాజరవడం మంచిదని భావించి ఆయన్ని ఆహ్వానించాను. ఈ వేడుకను అందరితో జరుపుకోవాలని కోరుకుంటున్నందున చాలా మందిని ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
 
ఇదిలావుంటే చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు వైఎస్ షర్మిల పసుపు రంగు చీర కట్టుకుని రావడంపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. తెదేపాకి మద్దతుగా ఆమె అలా చేసారంటూ కొందరు అంటుంటే... సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాకిచ్చేలా చేసారనంటూ మరికొందరు అంటున్నారు. అంతేకాదు... ఆమె చంద్రబాబు నాయుడికి ఇచ్చిన పూలబొకే కూడా పసుపు రంగు పూలతో కూడి వున్నాయనీ, అలా షర్మిల వైకాపాకి షాకిచ్చారంటూ పేర్కొంటున్నారు. మొత్తమ్మీద బాబుని షర్మిల ఆహ్వానించడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.