గుంతల రోడ్డుపై చాప వేసుకుని పడుకున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండు చేస్తూ, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నడిరోడ్డు పై చాప వేసుకుని పడుకుని నిరసన తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పూర్తిగా గుంతలు పడి ప్రయాణికులు నడవలేని స్థితిలో రోడ్లు ఉన్నాయని, వినూత్న రీతిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రోడ్డుపై తాటాకు చాపలు వేసుకుని పడుకున్నారు. అంతే కాదు... తనకు ఒళ్ళు హూనం అయిందని, డాక్టర్ తో వైద్యం చేయించుకున్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు ప్రయాణం చేస్తే వారితో పాటు డాక్టర్ ను కూడా వెంట తీసుకు వెళ్లాలని, ఎక్కడ ప్రమాదం జరిగితే డాక్టర్ అక్కడే నడి రోడ్డు పైన వైద్యం చెసేలా ఉందన్నారు. రాష్టాన్ని దివాలా దిశగా నడుపుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లకు పడిన గుంతలను పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటే సిగ్గు పడాలని అన్నారు. లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా, ఎర్ర చందనం మాఫియా, గ్రావెల్ మాఫియా, మైనింగ్ మాఫియలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే అని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమానికి గంగిన హనుమంతరావు, మత్సేటి ప్రసాద్, నున్న కృష్ణ, బిక్కిన సాంబ, కురుకూరి కిషోర్, వర్రే రాజెష్, మన్యం పెద్దబాబు, తలారి భగవాన్, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.