గుర్తుకొస్తున్నాయి..కాంగ్రెస్ జ్ఞాపకాలలో రాములమ్మ

vijayasanti with sonia
ఎం| Last Updated: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:13 IST)
విజయశాంతి కాంగ్రెస్ లో చేరిన నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరి 6 ఏళ్లు అయిందని చెప్పుకొచ్చారు.

ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి.. పార్టీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

ప్రస్తుతం ఆమె తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

తనకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటున్న సోనియా గాంధీ ఫొటోను తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన విజయశాంతి ‘‘ఫిబ్రవరి 25కి కాంగ్రెస్ పార్టీలో నా ఆరు సంవత్సరాల ప్రస్థానం పూర్తయి, ఏడవ సంవత్సరం ప్రారంభం అవుతోంది.

అండగా నిలిచిన ఏఐసిసి, పిసిసి మరియు సీఎల్పీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

మొదటి నుండి నిర్మాణాత్మకమైన ఉద్యమాలు అలవాటైన నా మనస్తత్వానికి, ప్రజా క్షేత్ర పోరాటాలలో మరికొంత దూకుడు అవసరమని అప్పుడప్పుడు అభిప్రాయం కలుగుతుంది.

అధిష్టానం అనుమతించినా కూడా.. కొన్ని తెలియని కారణాలతో, గతంలో నా ప్రజాపోరాట యాత్రల కార్యాచరణలు రకరకాల మార్పులకు గురికావటం, రద్దు కావటం వంటివి సంభవించాయి.

ఇవన్నీ ఒకసారి పునః సమీక్షించుకుని, ప్రజా సంక్షేమ ప్రాధాన్యతా పరమైన నిర్ణయాలను రూపొందించుకోవలసిన సమయంగా ఈ సందర్భాన్ని భావిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :