బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , సోమవారం, 16 ఆగస్టు 2021 (12:09 IST)

ర‌మ్య కుటుంబానికి సీఎం అండ‌; హోం మంత్రి సుచ‌రిత ఓదార్పు!

గుంటూరులో హ‌త్య జ‌రిగిన బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఏపీ హోంమంత్రి సుచ‌రిత పరామర్శించారు. నిందుతుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ర‌మ్య కుటుంబానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్ ను బాధిత కుటుంబానికి హోం మంత్రి స్వ‌యంగా అందించారు. రమ్య మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన సుచరిత ఇలాంటి సంఘ‌ట‌న‌ల్లో నిందితుడిని ఉరి తీసినా పాపం లేద‌న్నారు.

ర‌మ్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన‌ సందర్భంగా హోం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన అత్యంత బాధాకరమ‌న్నారు. సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడని అరెస్ట్ చేశాం అని చెప్పారు. నిందితుడిని ఒక్క రోజుల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింద‌ని, రమ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామ‌న్నారు.

ముఖ్యమంత్రి మహిళల భద్రత విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నార‌ని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి సూచించార‌ని సుచ‌రిత చెప్పారు. దిశ చట్టం ఎక్కడుంది.. అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయ‌ని, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌తిదీ రాజ‌కీయం చేస్తున్నాయ‌న్నారు.

రాష్ట్రంలో దిశ చట్టానికి సంబంధించి చర్యలు ప్రారంభించిన తర్వాత 58 రోజుల్లోనే మహిళలపై జరిగిన దాడులపై దర్యాప్తు పూర్తి అవుతుంద‌ని, ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లలను ఏర్పాటు చేసి, మహిళలకు రక్షణగా ప్రభుత్వం ఉంద‌న్నారు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో లో మూడు ఎఫ్.ఎస్.ఎల్ ల్యాబ్ లు కూడా త్వరలోనే పూర్తి అవుతున్నాయ‌ని, ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రిగారే స్వయంగా స్పందిస్తున్నార‌ని హోం మంత్రి సుచ‌రిత వివ‌రించారు.

మహిళపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క నేరస్థుడిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేద‌ని, దిలిపెట్టద‌ని చెప్పారు. అంతేకాకుండా, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలబడుతున్నామ‌న్నారు. మహిళపై అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి, ఒకరిని అరెస్టు చేశామ‌ని తెలిపారు.

పార్లమెంట్ లో దిశ బిల్లు చట్టంగా రూపొందితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులోకి వస్తాయ‌న్నారు. మహిళలు సురక్షితం కాని ప్రాంతాలకు వెళ్ళకూడద‌ని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాల‌ని సూచించారు.