బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (15:16 IST)

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్న హీరో బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హిందూపూర్ ప్రధాన కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని, ఇందుకోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. 
 
హిందూపూర్‌ను జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఉదయం పట్టణంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు మౌనదీక్ష చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని, రాజీనామాకు సిద్ధమన్నారు. రాజీనామాలు చేసే ధైర్యం వైకాపా నేతలకు ఉందా అని ప్రశ్నించారు. 
 
కొత్త జిల్లా ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు హిందూపురం ప్రధాన కేంద్రంగా మారేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. రాజకీయ లబ్ధి పొందేందుకే వైఎస్సార్‌సీపీ విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రాజుకున్న సంగతి తెలిసిందే.