శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (17:42 IST)

ఏపీలోని తెలంగాణ వారిని కూడా గుర్తించండి: ఏపీ టిఆర్ఎస్ అధ్యక్షుడు

నవ్యాంధ్రప్రదేశ్ లో ఉద్యోగరీత్యా కాని వ్యాపారరీత్యా గాని మరే ఇతర కారణం వల్ల గానీ ఇక్కడ కొచ్చి స్థిరపడిన తెలంగాణ వారిని కూడా గుర్తించి ఏపీ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు వీరికి అందేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని  ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ అన్నారు.

ఆదివారం సింగ్ నగర్ లోని తమ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదినారాయణ మాట్లాడుతూ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, తెలంగాణ అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ఏపీలో కూడా తెలంగాణ వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ కోరుతున్నామన్నారు.

లాక్ డౌన్ సమయం లో అటు ఇటు రాకపోకలు లేకపోవడంవల్ల సర్వే సమయంలో అందుబాటులో లేక కొందరికి రేషన్ కార్డులు, పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవడంలో కొంత  జాప్యం జరిగిందని ఇప్పుడు మరలా వెరిఫై చేయించి వారికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా సీఎం సహాయ సహకారాలు అందించాలని కోరారు.

లాక్ డౌన్ సమయం లో జర్నలిస్టు మిత్రులు ప్రాణాలకు తెగించి, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వార్తలు సేకరణ, వాటిని ప్రజలకు చేరవేయడంలో ఎంతో కీలక పాత్ర వహించారు అన్నారు. అటువంటి వారిని  ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి చివరికి ప్రభుత్వం మారిందని చేతులెత్తేసారు అని అన్నారు.

ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, వారు అప్పోసప్పో చేసి తీసుకువచ్చి వారు పెట్టిన డబ్బులకు గతంలో వాళ్లు చెప్పిన విధంగా కేటాయింపులు చేసి జర్నలిస్టులను కూడా ఓ ఇంటి వాళ్లని చేయాలని కోరుతున్నామన్నారు.

లాక్ డౌన్ సమయం లో సరైన జీతాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొన్ని సందర్భాల్లో ఇల్లు గడవక, ఇంటి అద్దె కట్టలేక చాలామంది అప్పుల పాలయ్యారు అన్నారు.

కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు  తదితరులు పాల్గొన్నారు.