ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (19:39 IST)

ఏపీ సర్కారుకు ‘రెడ్’ నోటీసు... ఈసారి వైద్య ప‌రిక‌రాలు!

బ‌డ్జెట్ లోటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని ఇంకా కుంగ‌దీస్తూనే ఉంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న కేంద్రం ఏపీ జెన్ కో కు నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్ తన అధికారిక వెబ్ సైట్ లో ఏపీ పరువు పోయేలా రెడ్ నోటీసును జారీ చేసింది. ఇందులో ఏమని చెప్పిందన్న విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ‘‘వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఏపీతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏపీ ఆరోగ్య శాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయొద్దు. ఏపీ సర్కారు ఇప్పటికే ఈ సంస్థలకు రూ.10వేల కోట్లు బకాయిలుపడింది’’ అంటూ నోటీసుల్ని జారీ చేసింది.
 
 
ఏపీ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన వైనం మీద జారీ చేసిన ఈ రెడ్ నోటీసులు ఏపీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా మారిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బకాయిలు భారీగా పేరుకుపోవటం.. చెల్లింపులు జరగకపోవటంతో ఇప్పుడీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10వేల కోట్లు అప్పు పడింది. బిల్లులు చెల్లించకపోతే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు రోడ్డెక్కటం.. ప్రభుత్వ టెండర్లలో పాల్గొనబోమని అడ్డం తిరగటం తెలిసిందే.

 
ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఏపీసర్కారుకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవటంపై పలు కంపెనీలు జాతీయ అసోసియేషన్ కు కంప్లైంట్ చేశాయి. వీటిపై స్పందించిన అసోసియేషన్ తమ అధికారిక వెబ్ సైట్ లో రెడ్ నోలీసు పోస్టర్ ను విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ఏపీ పలుచనయ్యేలా తాజా ఉదంతం ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం బిడ్లకు ఆహ్వానిస్తే స్పందించొద్దని.. వైద్య పరికరాల్ని సరఫరా చేయొద్దనిపేర్కొంది. ఒకవేళ ఏదైనా కంపెనీ కానీ సంస్థకు కానీ వంద శాతం అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే సరఫరాకు రావాలని పేర్కొన్నారు.
 
 
ఒకవేళ తమ ఆదేశాల్ని పట్టించుకోకుండా ఏదైనా కంపెనీ వైద్య పరికరాల్ని ఏపీకి పంపాలని నిర్ణయించుకుంటే.. ఆర్థికంగా రిస్క్ లో పడినట్లేనని పేర్కొంది. దేశంలో వైద్య పరికరాలు ఉత్పత్తిచేస ప్రతి కంపెనీ ఈ యూనియన్ లో ఉంటుంది. దాదాపు 500 కంపెనీలకు యూనియన్ మెంబర్ షిప్ ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ఏపీ సర్కారు ఇమేజ్ రోడ్డు మీద పడిన దుస్థితి. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.