శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (05:57 IST)

రాజధానిపై నెలరోజుల్లో నివేదిక?

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎల్​పీఎస్ లేఅవుట్లలో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి, వసతుల కల్పన కోసం ఐఐటీ రూర్కీకి చెందిన నిపుణులు అధ్యయనం చేయనున్నారు.

మొత్తం పనులపై నెలరోజుల్లోగా నివేదిక సమర్పించనున్నారు. అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల స్థలాల అభివృద్ధి చేసేందుకు సర్కారు నడుం బిగించింది. ఎల్​పీఎస్ లేఅవుట్లలో రహదారులు, ఇతర పనులపై ఐఐటీ రూర్కీ నిపుణులు అధ్యయనం చేయనున్నారు. ఇందులో ప్లానింగ్‌, ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాలకు చెందిన వారున్నారు.

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌ పచ్చజెండా ఊపారు. వాటిలో ఏ పనులు అవసరం, ఏ విధంగా ముందుకు వెళ్లాలి... వంటి అంశాలపై నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. ఈ మేరకు... ఐఐటీ రూర్కీ నిపుణుల బృందాన్ని ఎంపిక చేశారు. మొత్తం అధ్యయనం చేసే నివేదిక ఇచ్చేందుకు ఈ బృందం.... నెలరోజుల సమయం కోరింది.

ఇంకా తక్కువ సమయంలోనే నివేదిక ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఆర్​డీఏ స్పష్టం చేసినట్లు సమాచారం. పనుల వివరాలు రాజధానిలో 19,769 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైయిన్లు వంటి మౌలిక వసతుల పనులు, 17,910 కోట్ల రూపాయలతో లేఅవుట్లలో వసతుల పనులు చేపట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారయ్యాయి. వాటిలో ఎల్​పీఎస్ పనులు 14, ప్రధాన మౌలిక వసతుల పనులు 27 ఉన్నాయి.

ఎల్​పీఎస్ పనుల్లో ఆరు.. 25 శాతం కంటే తక్కువ పూర్తయ్యాయి. 8 ఇంకా ప్రారంభం కాలేదు. ప్రధాన మౌలిక వసతుల పనుల్లో ఏడు ఇంకా మొదలవలేదు. 13 పనులు 25 శాతం కంటే తక్కువ జరిగాయి. 6 పనులు 25- 50 శాతం మధ్య.... ఒక్క పని 50-75 శాతం మధ్య జరిగాయి. పనులు కుదింపు 2050 నాటికి రాజధాని జనాభా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని... ఈ ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం డిజైన్‌ చేసింది.

ప్రధాన రహదారుల్ని.. 8 వరుసలు, 6 వరుసలుగా నిర్మించాలని నిర్ణయించింది. తాగునీరు, మురుగునీరు, వరద నీటిపారుదల వ్యవస్థలు, కరెంటు, గ్యాస్‌ సరఫరా లైన్లు, కమ్యూనికేషన్‌ , ఓఎఫ్​సీ కేబుళ్లు వంటివన్నీ భూగర్భంలోని డక్ట్‌ల ద్వారా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడే.. అక్కడ అంత భారీస్థాయిలో రహదారుల నిర్మాణం అవసరం లేదని భావిస్తోంది.

గత ప్రభుత్వం ప్రధాన రహదారులు, ఎల్​పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు 38 వేల కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేయగా... ఈ ప్రభుత్వం పనుల పరిమాణాన్ని కుదించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ రెండు పనులకూ కలిపి... సీఆర్​డీఏ 15 వేల కోట్ల రూపాయలతో తాజాగా అంచనాలు రూపొందించి ముఖ్యమంత్రికి అందించింది.